| కవితలు | విష్ణుధనువు | (శిష్ట్లా ఉమా) విజయ మహేశ్వరము |
|
వేగూచుక్కా వెలగామొగ్గా కాళ్లాగజ్జా కంఖాణముపై కరహాట కరములతో కరవాలధారివై, ప్రణయాట్టహాసివై, కంఠీరవాకార కేయూర వయ్యారివై, కూలంకషాకాళ కేళీకరాళవై కాళివై, అనలముల కళకళల అందాలచిందువై నాయంకపాళిలో దహనమైతే నీవు పరపురుష రహితముగ ఇల అనలముల జల్లి దహనమయ్యెదను ఎదపైని ధవళాగ్నిలో! పుఠములో పండిన గద వన్నెలల దేలుట! నీశరీర సద్గంధ వాసలలతో మరచి నీఎదమీద పవళించు నామీద పరిమళవాయువుల వీచుచూ పవనుండు ఆకాశ మార్గాన ప్రాణాల గొంపోయి దూరాన విడిచితే, నీయదమీద దహనమౌ దేహాన్ని దూరాన దూపిల్లు ప్రాణాన్ని వీక్షించి, వ్యాకులమనసియౌను జీవాత్మ! జీవాత్మ దుఃఖమునుజూచి పరిహాసపడుతుంది విధికాంత; జీవాత్మ దుఃఖాన్ని విధికాంత హాసమును వినడు పరమాత్మ; పనికిరాని పరమాత్మ ఉండేమి లేకేమి! నాహృదయ రోదనము నాలోనే నిట్టూర్పు విడిచితే నాకెందు కీదైవ సంబంధం? దేముడబద్ధం! దయ్యాలు సత్యం! దయ్యాలరాణీ! నీశారీర సద్గంధ వాసనలలో ముంచి నీనగ్నహృదయము మీదనే నిర్మించు నా జీవభవనాన్ని! ఆ భవనాంతరాళమందొకచోట నాటుదము దయ్యాలపూదోట; పూదోటపందిళ్ల క్రిందనే నాపూర్వవీరుల ప్రతిభావంత ప్రేతాల విపరీత దాహాన్ని ఆర్పుకొరకై సాంవత్సరీకాలు జరుపుతూ ఉండెదము! ఆహా! దివ్యమంగళ సౌందర్య నిశీధమూర్తీ! నీముగ్ధ సౌందర్యానంద ప్రేరేపితుండనై నీతోడ నడిరేయి సడిలేక నిద్రించు వేళలందైనా, అయ్యో ప్రేయసి! నీపొందు మధ్యయందైనా, నా పూర్వవీరుల ప్రతిభావంత ప్రేతాల విపరీత దాహాల దావాగ్ని నా గర్భకుహరములో కుంపటై కుములుతూ కనరెక్కి కందుతూ నా జీవితాశయాల కాల్చితే, పెద్దలైనా బుల్లిపాపలైనా, రాజులైనా మహా రాణులైనా, గొప్ప ధీమంతులైనా నీచులైనా పరమదరిద్రులైనా మృత్యు కరాళ దంష్ట్రాల ధిక్కరించుటకు విధికాంత వేషాల వదిలించుకొనుటకు శక్య మేరికిని గాదనుకునే నన్ను బ్రతికున్న బహుకొద్ది నాడులైనా, మృత్యుదేవీ తనయ సౌందర్యనిశీధమూర్తీ! నీశారీర సద్గంధ వాసనలతో వీచి నీ యెదమీద పరిపించు నా సౌఖ్యశయ్యాతలము! గజ్జగుంటల గౌరికిలకిల నవ్వుకళలను గీరువలపుల నుజ్జ్వలనముల జేయగా నా నందిపై నటరాజు తందానతానుడై, కాటుకల కనుమెరుపు చిరునవ్వు తేటకై తేనియల ఊటకై, వేటాడు జుంటీగ పాటలను మించుపాటలను పాడుతూ నాడుతూ, అడుగడుగు వేడుతూ, వేడుకల వెంకటేశ్వరుఁడై, వీరశైవాద్వైతప్రణయుడై, గౌరి కర్ధాంగుడౌటకై చేయు గారాము సివము లారవములై వర్ణాల తిల్లాణములతో నాలోన వ్యాపించ సివమెత్తి పిలచితిని! సీతా! నిశీధసౌందర్యమూర్తీ నీయర్ధాంగమునకై! నిశీధసౌందర్యమూర్తినీ అర్ధభాగమునకై చెంచీతా! ఎలుగెత్తి పిలిచితిని! నాలోన నేనే విరిజెంది వ్యాపించి ప్రతిధ్వనించితిని! ప్రణయ కైలాస లోకైకనాథుడే ఉత్కృష్ట వీరశైవ వ్యక్తి. వ్యక్తిభావమే నిర్వాణము. నిరుపమ నిర్వాణ సిద్ధుడే పునర్జీవితుడై, ఉత్కృష్టవీర శైవవ్యక్తి అద్వైతలయానందమయు డౌను. ద్వైతమేమిథ్య; విశిష్టాద్వైతమే మాయ; నిశీధసామ్రాజ్యమూర్తీ! మాయలు మిథ్యలూ జీవావసరములే గావున సత్యములు: సత్యనదీప్రవాహమున మాయయూ మిథ్యయూ నంతర్వాహినులు. సౌందర్యమూర్తీ! సత్యనిర్ణయముకై, మాయా మంత్రముల యవసరములేమి? ఓహో నిశీధ సామ్రాజ్య సౌందర్యమూర్తీ, అద్వైత జ్వాలాభీలాంతర్గతకణములే ద్వైత విశిష్టాద్వైతములు. అద్వైతనిరాకార సంపూర్ణానంద సాకారరూపమే వీరశైవ ప్రణయము; ధవళమణి తళుకులే సప్త వర్ణముల జిలుగులౌరీతి, ప్రణయాంతర్జ్యోతులే షడ్విధకామమోహములు. తదధిపతులే షట్లోకాధినాథులు : సప్తలోకైక కైలాస నాథుడగుశంకరునివలె సంపూర్ణవ్యక్తి యగువానికే సర్వప్రాపంచ సమిష్టి సంద్రములో వ్యక్త్యభావ వైరాగ్య నిర్వాణ ముదయించి జ్ఞానియై సచ్చిదానందుడై యద్వైత లయుడౌను! ఏడుకొండలకోట ఏడుమేడలుపైని వెంకటేశ్వరుడై వెలిసియుండె శంకరుండు! అలివేలుమంగవై యాంధ్రదేవివై అవనిలో వెలుగుతూ నవతారమెత్తితివి! వీరశైవాద్వైత ప్రణయ ప్రణవముతో పురుషుడై వెంకటేశ్వరుడైనంత కాలమూ లావణ్యలలితవై సహధర్మచారిణిగనున్నావు .... ద్వావిడీచన్గవల తేట కారాటపడి అంధుడై యధమస్థుడైన తర్వాతనే, అరచాటు చన్గవల యలిమేలుమంగా! అలిగితివి అడవిలో వెన్నెలై వెలిసితివి!-- అవు నవును అందాల అలివేలు మంగా! పురుషత్వమూడిన మగవాని నేపడతి కోరును! తేటతెల్లమై కల్లవెల్లియై ఆరాటమడిగితే అతడే యావెనుక పాదములపై బడుచు అడుగులకు మడుగులను ఒత్తుచూ రాగలడు: నీ మూర్తి మాధుర్యమునకై ముగ్ధు డవగలడు! అనలముల అందాల దేవివైతే నీవు, నీయంక పాళిలో దహనమై పుఠమెత్తి శుద్ధుడవగలడు! నీ నయన నీరాజన ధవళ జ్వాలానల కణములే ఆంధ్ర బీజానలములై నూతనోత్పత్తి కాగలదు! ఓహో సౌందర్య సామ్రాజ్యమూర్తి! రక్తారుణప్రవాహ సమరకల్లోలములో ప్రజల ప్రఫుల్ల సౌందర్యజీవితానందముగ్ధులం జేయుదువు! అనంతముఖములుగల అందాల అనలమా! నీ సయ్యాటపాటల యారాటములతో కుందకిట కుండలంబులకాంతి బ్రహ్మాండమునకు తేజశ్శక్తియౌను! జీరాడు వోణీల నొయ్యారముగనెత్తి వింజామరల్ వీవగానీవు, ఆశక్తి సర్వవ్యాపకత్వము జెందును. కల్లోలమేఘాగ్నివై నడియెండలో మెరుపుతీగలపై వసంతములాడు వివస్త్రమూర్తీ! నీశరీరముపైన బంగారునూగారు విద్యున్మాలయై వర్ధిల్లుచున్నది! అనలముల దళములతో వెలుగొందు నాభీలపద్మమై నీముఖము నిత్యయౌవనమై ప్రణవాగ్ని పవనమై నాహృదయ అంబుధీ దావాగ్ని ధవళమౌతున్నది! ఓహో తేజమా ఓజమా ఆభీల బీజమా! స్ఫూర్జితాక్రాంతమా! నీజ్వాలలో సకలవర్ణములునూ నిలయమైయుండును. పలకలతో వికసించు వజ్రముల ధవళతలు, అలలుపైజిమ్మ సమ్మోదభరితమై విరుచుకుని వెదజల్లు అంబుధులమాణిక్య హారాలవర్ణములు, అనంతచైత్రముల నిబిడమౌ కెంజాయ చిగురాకు పూతలో రకరకపు రీతులు, ఉయ్యాలలూగు నీలధవళిమల మిళితమగు మంచు బిందువుల జిలుగైన రంగులు, నీప్రేమజ్వాలలో నిబిడమై నీరుకావులదేలు! ఓహో సౌందర్య సామ్రాజ్య విరాడ్విశ్వేశ్వరార్ధాంగపత్నీ! నక్షత్ర స్ఫటికముల నవనవలాడే వెలుగువై, తళుకువై, నిబిడాంధ కారాంధ్ర దేశాకాశాన, వజ్రాయుధమువలె ఏనాడు గన్పడెదవో దెల్పుము: త్రిపురాంతకుడనై లేచెదను, ప్రళయకాలాభీల గర్జపర్జన్యములతో, నిశీధ నిబిడాంధ కారాంతరాళాగ్నినగునేను....! ఉదయోదయాలనడుమ, ప్రాక్పశ్చిమ ప్రాకారములమధ్య, జీవితానంతరపు నిశ్శబ్దరూపముగ, మొలకెత్తుమున్నె చీకటిలో నిరీక్షించుచుండేటి విత్తనపు రూపుగా నీయాలయము నిర్మింపబడినది. ఉత్పత్తి లయములలో జీవితపు హాహాకారాలు, సంతోషధ్వానాలు, నీయందు నీవుచ్చరించే హ్రాం, హ్రీం, హ్రూం! హ్రః! అనే యుచ్చైస్స్వరాలు! ఆద్యంతములు మిళితమై నగయు నిశ్శబ్దకాలచక్రం బంగారు వడ్డాణరూపమై నీనాభికలంకారం, వడ్డాణమందు వ్రేలాడు నీలాలగజ్జలే మోహాలమొగ్గలై వెదజల్లు నాగస్వరాల - నామీదనిదురించు సర్పాలపడగలను విప్పుచూ! శ్రీకృష్ణసర్పాలయపురూప నాట్యముల ముదమైనమనసుతో నీవాకర్ణించి, కెరడుబారుచు మబ్బువలె పింఛాలవిప్పుకొను పెందొడల పైకెత్తి బాహువుల ముకుళించి చిరునగవుతో గర్భగుడి వేదిపై కుప్పించియెగయుచూ నర్తనలను జేయుదువు! నీ నర్తనలనాలించి జీవితము వికసించు - మృత్యువే ధ్వానించు: ఆకుపై ఆకుతో వేరుపైవేరుతో పూవుపైపూవుతో, సంధిసంధులమధ్య వాసిల్లు రహస్యాల గర్భాననేదాచి, ఏమృత్యువునుండి జనించి యేమృత్యువుకై తాను పెరుగునో యాజీవితానందపుకళలను వెన్నాడుచూ, అంధకారాంతరాళాలనుండి, వర్ణాల విత్తనాల్వికసించు! ఆ నీయానందనర్తనల వీక్షించ, సంగీతస్వరాల నాలించి, నాజీవి నాలోంచి పైపైననేలేచి, యావేశసుఖముతో, పింఛాలవిప్పుచూ, పిచ్చెత్తి తిరిగేటి నెమలియై, నీలమేఖమై, ప్రేమచే పచ్చనై పవిత్రరూపమై పమిట పరిచినరీతి నున్నన నై యుండు గర్భగుడివేదిపై, గూటిరెవికలపొంగుపీటుల మీదపోసే పూలమాదిరి తీర్చివేసిన ముగ్గుకమలపు మెత్తరేకుల పైన ఆడుచూ పాడుచూ వీరశైవానంద బాష్పముల స్ఖలనము జేయగా నన్జూచి ఆనంద తన్మయముతో ఏకాగ్రదృష్టిచే, శివలింగ భ్రమరమును దాల్చు పానవట్టము పద్మమునుబోలు కంటితో, నెమలివలె, ఆకర్షణము చేసుకొందువు! నిశ్చేష్టుడనై నిన్నే అవలోకించుచూ నివ్వెరజెందు నాయెదమీద మహదయతో నర్ధోదయాంబుధి కన్యరీతి నురుగుల నగు మోముతో చిద్విలాసముల తాండవము ఆడుదువు! జగమునే మరిపించు నీపాద స్పర్శకు నేత్రములు మూయుచూ మోదమౌ మూర్ఛలో నేముణుగు సమయాన కాలమే స్తంభించు! కాలగర్భంలోనుంచి కదులుతూ వచ్చే ప్రళయ గర్భంలోంచి పగులుతూ పైబడే పురుషత్వము ఒకేమారుగ లేచి పునర్జీవియై నీనృత్యతాండవం బంతలోనే ఆపి ఈశ్వరస్వరూపధారినై నేనటరాజునై ప్రళయకాల ఆభీల ప్రచండవాయువుల సంగీతస్వరముతో, భ్రమ, భీతి, ఆవేదనా ప్రణయ ఆనందమౌ ప్రణవరాగముతో, మోహనాకారుడనై దివ్యనృత్యముల ఆడుచూ డమరుకము గీటుచూ, -- మధురసపు మధురముగ, విత్తనపు వృక్షముగ సంగీత రాగముగ సంధ్యారుణ వర్ణముగ, సర్వప్రపంచమూ సర్వస్వమౌ నిన్ను నాలోనే నిలయించి మేళకర్తృ జన్యరాగంబులంబోలు అర్ధ నారీశ్వరుండనై, విశ్వరూపినై నర్తనము చేయుచుండేవేళ నాలోనే అణగియుండే నీవు "ప్రత్యక్షం సత్యమ వాదిషం! సోహం బ్రహ్మ సోహం బ్రహ్మ!" "అహమేవ ప్రత్యక్షం ఋతమకారిషం-- అహమస్మి బ్రహ్మాహమస్మి!" కపిలుడ నేనే కృతయుగ రాముడ నేనే! త్రేతా ద్వాపర కృష్ణుడ నేనే!, కలి విరాముడ కల్కిని నేనే! నాల్గుయుగంబుల నలువను నేనే! రాముడ, నూతన రాముడ నేనే! భూమిసుతా! సీతా! వెన్కటి ద్వాపరాంత కలియుగాది చెంచీతవు! వెంకటేశ్వరుడ నేనే! వెన్నెలవేళ ఏలా యలిగి పోయెద వలిమేలు మంగ?!-- |